Madhu Yaskhi: ఈ భేటీ దేశ రాజకీయాల్లో మార్పునకు నాంది: మధుయాష్కీ

  • రాహుల్, చంద్రబాబు భేటీ చారిత్రాత్మకం
  • లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలి
  • థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మభ్యపెట్టారు

ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. రాహుల్‌, చంద్రబాబుల భేటీ చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటికీ ఈరోజు జరిగిన భేటీ దేశ రాజకీయాల్లో మార్పునకు నాందిగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.

ఏ రాజకీయ పార్టీకైనా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్న ఆయన రాజ్యాంగ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను ప్రభావితం చేస్తున్న భాజపాను ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందన్నారు. తనకు మద్దతిచ్చే వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

భాజపా, ఆరెస్సెస్‌ ఆలోచన దేశాన్నివిభజించు, పాలించు అనే రీతిలో కొనసాగుతున్న నేపథ్యంలో లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ ఆలోచనా విధానాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పాత విభేదాలను పక్కనబెడుతూ దేశ రక్షణ, దేశ సంపద కాపాడటం కోసం ఇలాంటి కలయిక అవసరమని అభిప్రాయపడ్డారు.

అన్ని విపక్షాలను కలుపుకొని పోవడంపై ఇరువురు నేతలూ చర్చించినట్టు మధుయాష్కీ తెలిపారు. అందుకే ఈ భేటీ చారిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు. ఈ భేటీకి కొనసాగింపుగా చంద్రబాబుతో సమావేశమై ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, అశోక్‌గెహ్లోట్‌లను రాహుల్‌ ఆదేశించారని మధుయాష్కీ వెల్లడించారు.

ప్రతిపక్షాలను, ప్రశ్నిస్తున్న సొంత పార్టీ నాయకులపైనా దొంగ కేసులు పెడుతూ ఈడీ, సీబీఐలను బూచిగా చూపి మోదీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేయాలని చూశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాత్ర లేకుండాఎలాంటి ఫ్రంట్‌ ఏర్పాటైనా అది బీజేపీకి మేలు చేస్తుందన్నారు. మోదీకి కేసీఆర్‌ ఏజెంట్‌గా మారి మూడో కూటమి ఏర్పాటు అంటూ మభ్యపెట్టారన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News