Karti Chidambaram: కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో నిరాశ

  • పిటిషన్‌పై సత్వర విచారణకు నో
  • ఆయన విదేశాలకు వెళ్లడం ముఖ్యం కాదు
  • స్పష్టం చేసిన ధర్మాసనం

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి నిరాశ ఎదురైంది. కార్తి చిదంబరం అభ్యర్థనపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపడం కుదరదని స్పష్టం చేసింది.

కార్తి చిదంబరం విదేశాలకు వెళ్లడం అత్యవసర విచారణ జరపాల్సినంత ముఖ్య విషయం కాదని, మిగతా కేసుల కన్నా ముందుగా విచారణ జరపనక్కర్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల వద్ద తాము నిర్వహించగలిగినదాని కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

ఇదిలావుండగా చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగిన సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి విదేశీ పెట్టుబడులకు అనుమతుల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతిలో కార్తి చిదంబరంకు భాగముందని ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News