Andhra Pradesh: యువతికి మద్దతుగా నిలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. రోడ్డుపై ధర్నాకు దిగిన టీడీపీ నేత!

  • యువతి కిడ్నాప్ నకు యత్నించిన నాగరాజు
  • ప్రబోధానంద వర్గీయులను రక్షించడంపై జేసీ మండిపాటు
  • రోడ్డుపై బైఠాయించడంతో స్తంభించిన ట్రాఫిక్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ రోజు మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ప్రబోధానంద స్వామి శిష్యులను పోలీసులు రక్షిస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఈరోజు ఆందోళనకు దిగారు. కిడ్నాపర్లపై కేసు పెట్టకుండా బాధిత కుటుంబాన్ని కేసులతో వేధించడం ఏంటని ప్రశ్నించారు.

ప్రబోధానంద శిష్యుడు నాగరాజు తాడిపత్రిలో ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యువతి కళ్లలో కారం కొట్టి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. దీంతో వెంటనే యువతి కేకలు పెట్టింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు బయటకువచ్చి నాగరాజును చావగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ నేరస్తుడిపై కేసు పెట్టడానికి బదులు నాగరాజు ఫిర్యాదుతో అధికారులు యువతి కుటుంబంపైనే ఎదురుకేసు పెట్టారు.

దీంతో బాధిత కుటుంబానికి మద్దతుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. జేసీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో స్తంభించింది. నాగరాజును అరెస్ట్ చేసేవరకూ ఆందోళన విరమించబోమని జేసీ స్పష్టం చేశారు.

More Telugu News