Doctor: హనీమూనే శాపమైంది... స్లో పాయిజన్ తీసుకుంటూ వైద్యురాలి ఆత్మహత్య!

  • సహచర డాక్టర్ ను ప్రేమించిన జయశ్రీ
  • పెద్దల అంగీకారంతో పెళ్లి
  • హనీమూన్ డబ్బివ్వాలంటూ వేధింపులు
  • గుండెపై ప్రభావం చూపే ఔషధాలు తీసుకుని ఆత్మహత్య

వైద్య విద్యను అభ్యసించే సమయంలో తన సహచరుడిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లి తరువాత తన జీవితం ఆనందంగా సాగుతుందనుకున్న ఆమె ఆశలు అడియాస కాగా, గుండె కొట్టుకునే వేగాన్ని క్రమంగా తగ్గించే మందులను స్లో పాయిజన్ గా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన డాక్టర్‌ గురువయ్య రెండో కుమార్తె జయశ్రీ, చైనాలో వైద్య విద్యను అభ్యసించే సమయంలో అల్వాల్‌ కు చెందిన రాజేశ్వర్‌రావు కుమారుడు కార్తీక్‌ ను ప్రేమించింది. ఇద్దరూ డాక్టర్లే కావడంతో రెండు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయి. ప్రేమ వివాహమే అయినా, పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 45 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులను కుమార్తెకు కానుకగా ఇచ్చాడు గురవయ్య.

కొత్త దంపతులు హనీమూన్‌ కు నిమిత్తం, సింగపూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. అదే ఆమె పాలిట శాపమైంది. హనీమూన్‌ కోసం వెచ్చించిన డబ్బులు ఇవ్వాలని కార్తీక్‌, స్వయంగా తన మామను అడిగాడు. తాను ఇచ్చుకోలేనని గురువయ్య చెప్పడంతో అప్పటి నుంచి భార్యను వేధించడం ప్రారంభించాడు. కార్తీక్ కు, అతని తండ్రి రాజేశ్వర్‌ రావు, తల్లి భానుమతి కూడా తోడై జయశ్రీని వేధించారు.

 దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, గుండెపై ప్రభావం చూపే మందులు మింగింది. మంగళవారం రాత్రి ఆమె తీసుకున్న మందులతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భర్త ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న జయశ్రీ తల్లిదండ్రులు వచ్చేసరికే ఆమె మరణించింది. అదనపు కట్నం వేధింపులతోనే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

More Telugu News