mahakutami: అందరి దృష్టి గ్రేటర్‌ హైదరాబాద్‌ పైనే... కాంగ్రెస్‌ ఆశావహుల్లో టెన్షన్‌!

  • మహాకూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యం
  • ఎవరి సీటు గల్లంతవుతుందో, ఎవరికి అవకాశం వస్తుందో అన్న ఆందోళన
  • టీడీపీ, టీజేఎస్‌ గురి నగరంలోని స్థానాలపైనే

టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ మహా కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చేసుకున్న సంగతి విదితమే. అయితే, కాంగ్రెస్‌ నాయకుల్లో ఇప్పుడిదే టెన్షన్ పెడుతోంది. ఇతర మిత్రపక్షాలన్నీ మహా హైదరాబాద్‌ నగరం పరిధిలోని నియోజక వర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం కాంగ్రెస్‌ ఆశావహుల్ని నిరాశపరుస్తోంది. ఒప్పందంలో భాగంగా ఎవరి సీటు పోతుందో, ఎవరికి అవకాశం వస్తుందో అన్న ఆందోళనతో ఆశావహులు గడుపుతున్నారు.

సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు పట్టున్నందున హైదరాబాద్‌లోని పలు స్థానాలు కేటాయించాలని టీడీపీ కోరుతోంది. టీజేఎస్‌ కూడా గ్రేటర్‌ స్థానాలనే డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదల కానుందన్న సమాచారంతో ఔత్సాహికుల్లో ఒకటే టెన్షన్‌. ఇప్పటికే ఆశావహులు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇంతా అయ్యాక జాబితాలో పేరు లేకపోతే, మిత్రపక్షాలకు తమ సీటు కేటాయిస్తే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. తొలి జాబితాలో గ్రేటర్‌ పరిధిలో నాలుగైదు నియోజకవర్గాల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ సీనియర్లు, మాజీలకే అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు.

More Telugu News