Uttar Pradesh: 31 ఏళ్ల తర్వాత వెలువడిన హషీంపురా సామూహిక హత్యల కేసు తీర్పు.. 16 మంది పోలీసులకు జీవిత శిక్ష

  • 42 మంది ముస్లింలను కాల్చి చంపిన పోలీసులు
  • ట్రయల్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు
  • మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారన్న ధర్మాసనం

హషీంపురా సామూహిక హత్య కేసులో 31 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. మొత్తం 16 మంది యూపీ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లకు జీవిత శిక్ష విధిస్తూ బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.  22 మే, 1987లో మొత్తం 42 మంది ముస్లిం వ్యక్తులను కానిస్టేబుళ్లు కాల్చి చంపారు. వీరిలో 38 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మీరట్‌లోని హషీంపురాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2015లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు 16 మందిని దోషులుగా ప్రకటించి శిక్షలు ఖరారు చేసింది.

ముస్లింలపై కాల్పులు జరిపిన పోలీసులు అనంతరం వారిని పంట కాల్వలోకి తోసేశారు. జస్టిస్ ఎస్.మురళీధర్, వినోద్ గోయల్‌తో కూడిన ధర్మాసనం  తీర్పు వెలువరిస్తూ.. ఓ లక్ష్యంతోనే ఈ హత్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్టు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో మరిన్ని వాదనలు వినడానికి అంగీకరించని న్యాయమూర్తులు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు మిఠాయిలు పంచుకున్నాయి.

More Telugu News