Andhra Pradesh: ‘అమరావతి హ్యాపినెస్ట్ ప్రాజెక్టు’లో భాగంగా 1,200 ఫ్లాట్లు కడుతున్నాం!: సీఎం చంద్రబాబు

  • ఈ గృహనిర్మాణ ప్రాజెక్టును పారదర్శకంగా చేపడతాం
  • వచ్చే నెల 9 నుంచి వెబ్ పోర్టల్ ప్రారంభం
  • సీఆర్డీఏ పనులపై సీఎం సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రజల గృహ నిర్మాణం కోసం చేపట్టిన ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. రాజధానిలో చేపట్టిన తొలి ప్రాజెక్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ రోజు సచివాలయంలో సీఆర్డీఏ పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ సమర్పించారు.

ప్రజంటేషన్ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతి హ్యాపీనెస్ట్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఇప్పటికే ఆదరణ ఏర్పడిందని తెలిపారు. నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. మొత్తం 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. తొలిదశలో భాగంగా ఆరు టవర్లలో 600 ఫ్లాట్లను జీ+18 పద్ధతిలో నిర్మిస్తామన్నారు. ఈ ఫ్లాట్లు 6 కేటగిరీలుగా ఉంటాయనీ, చదరపు అడుగు విలువ సుమారు రూ.3,500 ఉంటుందని చెప్పారు.

ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 9 నుంచి ప్రత్యేక వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఇందుకోసం సచివాలయంలో ఓ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తమకు కావాల్సిన ఫ్లాట్లను ఎంచుకునేందుకు వీలుగా పోర్టల్ లో త్రీడీ గ్రాఫిక్స్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం విధానంలో ఇళ్ల కేటాయింపులు జరపాలని సూచించారు.

More Telugu News