India: రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్న ఉర్జిత్ పటేల్!

  • కేంద్రంతో విభేదాలే కారణమంటున్న సన్నిహితులు
  • ఆర్బీఐకి మార్గదర్శకాలు ఇచ్చేందుకు కేంద్రం ప్లాన్
  • స్వతంత్రత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్న నిపుణులు

కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మధ్య వివాదం మరోసారి ముదిరింది. ఈసారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్బీఐని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా రుణాలను ఇస్తూ పోతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి ఉర్జిత్ పటేల్ తప్పుకునే అవకాశముందని భావిస్తున్నారు.

ఈ విషయమై ఉర్జిత్ పటేల్ సన్నిహితులు కొందరు స్పందిస్తూ.. గవర్నర్ బాధ్యతల నుంచి పటేల్ తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపై కూడా కేంద్రం గుర్రుగా ఉంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయాలని కేంద్రం యోచిస్తోందనీ, అలాంటి నిర్ణయం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుందని ఆచార్య హెచ్చరించారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 కింద రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం విరాల్ ఆచార్య ను సాగనంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అటు రిజర్వు బ్యాంకుగానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. మరోవైపు ఆర్బీఐలో తాజా పరిణామాలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం స్పందించారు. కేంద్రం రిజర్వు బ్యాంకుకు మార్గదర్శకాలు జారీచేస్తే మరిన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుందని హెచ్చరించారు.

More Telugu News