rafale: రాఫెల్ కుంభకోణం.. కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు!

  • రాఫెల్ ఒప్పందంలోని ధరలు, వ్యూహాత్మక వివరాలను సమర్పించాలంటూ సుప్రీం ఆదేశం
  • యుద్ధ విమానాల ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరముందన్న అటార్నీ జనరల్
  • వెల్లడించడం కుదరదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించే ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కొనుగోలు ఒప్పందంలోని ధరలు, వ్యూహాత్మక వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పదిరోజుల్లోగా అన్ని వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్ సెట్ భాగస్వాముల వివరాలను కూడా అందించాలని ఆదేశించింది.

మరోవైపు, యుద్ధ విమాన ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని... అందువల్ల వీటి ధరలను వెల్లడించడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ కోర్టుకు తెలిపారు. రహస్య వివరాలను వెల్లడించడం సాధ్యం కాని పరిస్థితుల్లో వెల్లడించడం కుదరదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం సూచించింది. బహిర్గతం చేయలేని కీలక సమాచారాన్ని పిటిష్నర్లకు  తెలియజేయాల్సిన అవసరం లేదని చెప్పింది. న్యాయమూర్తులు వినీత్ దండా, మనోహర్ లాల్ శర్మలు దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారించింది. రాఫెల్ ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిష్నర్లు కోరగా... ప్రస్తుతం సీబీఐలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని... అవన్నీ చక్కబడిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం తెలిపింది. 

More Telugu News