ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు.. ఎడబాటును తట్టుకోలేక బావిలోకి దూకిన యువకుడు!

31-10-2018 Wed 09:31
  • మేడ్చల్ లోని ఘట్ కేసర్ లో ఘటన
  • ప్రియురాలి మరణంతో డిప్రెషన్ లోకి
  • మద్యం సేవించి బావిలోకి దూకి ఆత్మహత్య
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నికష్టాలు ఎదరైనా కలిసి జీవించాలని అనుకున్నారు. అయితే ఏం సమస్య ఎదురైందో యువతి ప్రాణాలను తీసుకుంది. ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేని యువకుడు కూడా బలవన్మరణం చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

నేరెడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన శివ(23) కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే సదరు యువతి అకస్మాత్తుగా సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో శివ డిప్రెషన్ లోకి జారిపోయాడు.

అనంతరం ఇక్కడి గుంటిగూడెం సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుని పూటుగా మద్యం తాగాడు. ఆ తర్వాత స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా, శివ జాడ తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే ఈతగాళ్లను రంగంలోకి దించారు. దీంతో బావిలో ఉన్నశివ మృతదేహాన్ని వారు వెతికి బయటకు తీసుకొచ్చారు. శివ చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.