Andhra Pradesh: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై కేసు నమోదు.. మీడియాపై చిందులు వేసిన టీడీపీ నేత!

  • పోలవరం కుడి కాలువలో అక్రమ మట్టి తవ్వకం
  • అనుచరుల వాహనాలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్
  • అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని

పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులపై కేసు నమోదయింది. పెదవేగి మండలం కొప్పాక సమీపంలోని పోలవరం కుడికాలువ నుంచి మట్టిని అక్రమంగా తరలించడమే కాకుండా వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులను దుర్భాషలాడారు. దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్‌ 447(అక్రమ ప్రవేశం), సెక్షన్‌ 353(విధులకు ఆటంకం), సెక్షన్‌ 441(దౌర్జన్యం), సెక్షన్‌ 379 (దొంగ రవాణా), రెడ్‌విత్‌ 34 (ఎక్కువ మంది పాల్గొనడం) తో పాటు మైనింగ్ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు  నమోదు చేశారు.

ఈ విషయమై విజిలెన్స్ ఎస్పీ అచ్యుతారావు మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై నారాయణపురం, కైకరం ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సమాచారం రావడంతో కొప్పాక దగ్గర పోలవరం కుడికాలువ వద్దకు వెళ్లామన్నారు. అక్కడే ఓ జేసీబీ, నాలుగు టిప్పర్లు ఉండటంతో వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడకు వచ్చి అధికారులపై చిందులు వేశారన్నారు.

అనంతరం మైనింగ్ అధికారులకు సైతం ఫోన్ చేసి రమ్మని చెప్పారన్నారు. ఇంతలో చింతమనేని సతీశ్ సహా 100 మంది అనుచరులు అక్కడకు వచ్చి అధికారులతో గొడవ పడ్డారని తెలిపారు. ఖాళీ లారీలను ఆపడానికి మీరెవరు? అంటూ దుర్భాషలాడుతూ వాహనాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని వెల్లడించారు. మరోవైపు ఈ విషయమై నిన్న జిల్లా విజిలెన్స్ ఎస్పీతో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ బయటకు రాగానే మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరుష పదజాలం వాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News