Andhra Pradesh: గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాం.. 10 లక్షల ఐవోటీ పరికరాలను వాడుతున్నాం!: మంత్రి లోకేశ్

  • పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు
  • రాష్ట్రంలో 30 లక్షల ఎల్ఈడీ లైట్లను అమరుస్తున్నాం
  • ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు

టెక్నాలజీ సాయంతో ఏపీలోని గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే గ్రామాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో ఈ రోజు ‘గ్రామ స్థాయిలో సుస్థిర లక్ష్యాల నిర్దేశం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోర్ డ్యాష్ బోర్డు ద్వారా ఏయే శాఖల్లో అభివృద్ధి పనులు ఎంతెంత దూరం వచ్చాయో చిటికెలో తెలుసుకోవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐవోటీ) పరికరాలను వాడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం గ్రామాల్లో 30 లక్షల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నామనీ, తద్వారా భారీగా విద్యుత్ ను ఆదా చేయొచ్చని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

More Telugu News