Jagan: జగన్ పై కత్తిపోటు చిన్నదా.. నా దగ్గరకు రండి అదే కత్తితో పొడుస్తా, డైరెక్టుగా పైకి పోతారు!: వైసీపీ నేత మిథున్ రెడ్డి

  • మనిషన్న వాడు తల్లి, చెల్లిని ఇబ్బంది పెట్టడు
  • రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అసహ్యం వేస్తోంది
  • కేంద్ర బలగాలను కేటాయించాల్సిందిగా కోరాం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం ఎయిర్ పోర్టులో జరిగిందనీ, అది కేంద్రం పరిధిలోని విషయమని ఏపీ సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పడంపై వైసీపీ నేత మిథున్ రెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేనందున ఈ ఘటనపై సీబీఐ కానీ మరే ఇతర విచారణ సంస్థలో దర్యాప్తు జరిపించాలని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు తెలిపారు. దీనికి రాజ్ నాథ్ కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. జగన్ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారనీ తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ పై కత్తిపోటు చిన్నదేనన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఆ మాట చెప్పిన టీడీపీ నేతలను నా దగ్గరకు తీసుకురండి. నేను వాళ్లను మెడపై కొద్దిగా పొడుస్తా. అదే కత్తితో మెడపై పొడిస్తే డైరెక్టుగా పైకి వెళ్లిపోతారు’ అని మండిపడ్డారు. జగన్ ను చంపేందుకే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఈ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలపై మాట్లాడుతూ..‘ఎవరికైనా ఓ తల్లి, ఓ చెల్లి మీద అనుమానం వస్తే వాడు మనిషే కాదు. ఇలాంటి వ్యాఖ్యలపై మాట్లాడటానికే అసహ్యం వేస్తోంది’ అని తెలిపారు.

పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడితే జగన్ మాట్లాడినట్లేనని మిథున్ రెడ్డి వెల్లడించారు. తల్లి, చెల్లిని బయటకు లాగి టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కు కనీసం ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని కూడా చంద్రబాబు అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 3 నుంచి ప్రజా సంకల్పయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్ర దృష్ట్యా ఏపీ పోలీసులకు తోడు కేంద్ర బలగాలను కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.

More Telugu News