తిరుమలలో హైడ్రామా.. తోటి పూజారిని లైంగికవేధింపుల కేసులో ఇరికించేందుకు యత్నించిన ప్రబుద్ధుడు!

30-10-2018 Tue 10:18
  • మణికంఠ, మారుతిస్వామిల మధ్య విభేదాలు
  • మణికంఠను ఇబ్బంది పెట్టేందుకు ప్లాన్
  • పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలోని అర్చక నిలయంలో హైడ్రామా జరిగింది. విభేదాల నేపథ్యంలో ఓ అర్చకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చిత్రీకరించేందుకు మరో అర్చకుడు యత్నించాడు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలను అతని వద్దకు పంపి గొడవ జరిగేట్లు డ్రామా ఆడించాడు. అయితే విజిలెన్స్ అధికారులు ఇద్దరు మహిళలను పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

శ్రీవారి అర్చక నిలయంలో సంభావన అర్చకులుగా ఉన్న మణికంఠ, మారుతిస్వామిల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠపై కక్ష పెంచుకున్న మారుతి స్వామి అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలను మణికంఠ ఉండే చోటుకు పంపాడు.

మణికంఠ అర్చక నిలయం వద్ద ఉండగా ఇద్దరు మహిళలు అక్కడకు చేరుకుని తమను లైంగికంగా వేధించాడంటూ దాడికి దిగారు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న విజిలెన్స్ అధికారులు.. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన తిరుమల పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.