Srinivasa Rao: శ్రీనివాసరావు ఖాతాల్లో రూ. 1,365... మూడు నెలల క్రితం రూ. 70 వేల విత్ డ్రా!

  • శ్రీనివాసరావు పేరిట మూడు బ్యాంకు ఖాతాలు
  • ఇటీవల రూ. 40 వేలు జమ చేసిన ఫ్యూజన్ ఫుడ్స్
  • విజయాబ్యాంకు ఖాతాలో రూ. 1000
  • గుర్తించిన సిట్ దర్యాఫ్తు బృందం

వైఎస్ జగన్ పై దాడిచేసిన శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుతం కేవలం రూ. 1,365 మాత్రమే ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల్లో శ్రీనివాసరావుకు ఖాతాలు ఉండగా, ఎస్బీఐ ఖాతాలో మూడు నెలల క్రితం రూ. 70 వేల లావాదేవీలు జరిగాయని, ఇప్పుడా ఖాతాలో రూ. 320 ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలో జగన్ పై దాడి చేయకముందు ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యాజమాన్యం రూ. 40 వేలను జమ చేసినట్టు తెలుస్తోంది. ఇక అమలాపురంలోని విజయాబ్యాంకులో ఉన్న ఖాతా తెరచినప్పుడు రూ. 1000 వేసిన శ్రీనివాసరావు, ఆ మొత్తాన్ని కదిలించలేదు. ఆంధ్రా బ్యాంకులోని ఖాతాలో రూ. 45 నిల్వ ఉంది.

ఇక శ్రీనివాసరావు తండ్రి తాతారావు పేరిట, సోదరుడు సుబ్బరావు పేరిట పీఎంజేవై పథకంలో భాగంగా రెండు ఇళ్లు మంజూరు కాగా, తాతారావు గృహ నిర్మాణం చేపట్టగా, రూ. 1.30 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. సుబ్బారావు మాత్రం ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. అతని ఖాతాలో ఆరు నెలల కిందట ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రూ. లక్షను వేసినట్టు కూడా అధికారులు గుర్తించారు.

కాగా, జగన్ పై దాడికి ముందు శ్రీనివాస్ ఎక్కువగా అమ్మాయిలతో, తనతో పాటు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతోనూ ఎక్కువగా మాట్లాడేవాడని గుర్తించిన సిట్ అధికారులు, వారిని విచారిస్తున్నారు. అతను ఏ విషయాలు మాట్లాడతాడు? జగన్ గురించి ఏమైనా చెప్పేవాడా? వంటి ప్రశ్నలు సంధిస్తూ, వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News