Chandrababu: జగన్ పై ఆయన అభిమాని దాడి చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు: చంద్రబాబు

  • జగన్ పై దాడి విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుంటే.. ప్రతిపక్షం కుట్రలు చేస్తోంది
  • ఎన్డీయేలో ఉన్నంత కాలం తమ నేతలపై ఐటీ దాడులు జరగలేదు

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పై ఆయన అభిమానే దాడి చేస్తే... దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుంటే, మరో వైపు ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని... అయినా, అన్నింటినీ ఎదుర్కొని అభివృద్ధి ఆగకుండా చూశామని చెప్పారు.

మంచి జరుగుతుందనే అభిప్రాయంతోనే ఎన్డీయేలో చేరామని... వారి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేకపోవడం వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు అన్నారు. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని చెప్పారు. ఎన్డీయేలో ఉన్నంత కాలం తమ నేతలపై ఐటీ దాడులు జరగలేదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని తెలిపారు.

సీబీఐని కూడా భ్రష్టు పట్టించారని... ఆ సంస్థలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ ప్రతిష్టకు మచ్చ తీసుకొచ్చాయని అన్నారు. వినూత్న ఆలోచనలతో సత్ఫలితాలను సాధిస్తున్నామని... నీరు-ప్రగతి, నరేగా కన్వర్జెన్స్ లు అందుకు ఉదాహరణ అని చెప్పారు. 

More Telugu News