wife murder: దారుణం... వివాహితపై పెట్రోల్‌పోసి నిప్పంటించి హత్య!

  • అడ్డు తొలగించుకునేందుకు ఘోరానికి ఒడిగట్టిన భర్త
  • వివాహేతర సంబంధాన్ని వివాహం వరకు నడిపిన ఘనుడు
  • చివరికి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం

భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకుని కాపురం చేశాడు. కొన్నాళ్లు సజావుగా జీవితం సాగిపోయాక ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. భర్త రెండో కాపురం విషయం తెలిసిన మొదటి భార్య నిలదీయడం, పంచాయతీ పెద్దల వరకు విషయం వెళ్లడంతో రెండో భార్యను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం పిలిచి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరం సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.

స్థానికంగా కలకలానికి కారణమైన ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాలు ఇలావున్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన మహ్మద్‌ సుకుమార్‌ ఆర్‌ఎంపీ వైద్యుడు. కొన్నేళ్లుగా కొండమల్లేపల్లిలో క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొండమల్లేపల్లికి చెందిన షమీనా (32)తో మహ్మద్‌కు పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో 2017లో  షమీనాను అహ్మద్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ సంగతి మొదటి భార్యకు తెలియడంతో ఆమె పంచాయతీ పెట్టించింది. పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు మహ్మద్‌ ఆరు నెలల క్రితం తొలిభార్య పుట్టిన ఊరైన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో కాపురం పెట్టాడు. క్లినిక్‌ కూడా ఆ ఊరికే మార్చాడు.

అప్పుడప్పుడూ కొండమల్లేపల్లిలో ఉన్న రెండో భార్య వద్దకు వెళ్లి వచ్చేవాడు. తనతోనే ఉండాలంటూ షమీనా కూడా తరచూ ఒత్తిడి  చేస్తుండడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడాల్సి ఉంది రావాలని కబురు పంపాడు. ఆమె కారులో ఇంద్రపాలనగరం గ్రామ శివారుకు చేరుకున్నట్లు తెలుసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లాడు. కారు డ్రైవర్‌ను దూరంగా పంపాడు. అనంతరం తన వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అగ్నికీలల్లో చిక్కుకున్న షమీనా ప్రాణభయంతో పరుగెడుతుంటే  కర్రతో తలపై మోదాడు. కిందపడిపోతూ ఆమె వేసిన కేకలకు చుట్టుపక్కల వారు పరుగున రావడం చూసి పరారయ్యాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన షమీనాను తొలుత రామన్నపేట ఆస్పత్రికి, అనంతరం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News