Andhra Pradesh: జగన్ ను చంపేయాలనే దాడి చేశాడు.. అప్రమత్తంగా ఉండటంతో త్రుటిలో తప్పించుకున్నారు!: ఏపీ పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడి

  • జగన్ మెడపై పోటు వేయాలనుకున్నాడు
  • పక్కకు జరగడంతో జగన్ కు ప్రమాదం తప్పింది
  • దాడికి రెండు కత్తులను తెచ్చుకున్నాడు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను చంపాలనే నిందితుడు శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జగన్ కు ప్రాణహాని చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు. అయితే దాడి సమయంలో జగన్ అప్రమత్తంగా ఉండటంతో, దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జగన్ మెడపై దాడి చేయాలని నిందితుడు అనుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు. ఈ దాడి కోసం నిందితుడు రెండు కత్తులను తెచ్చుకున్నాడనీ, మొదటి పోటు తప్పిపోయినా మరో కత్తితో దాడి చేసేందుకు ప్రణాళిక రచించాడని వెల్లడించారు.

వైసీపీ అధినేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును ఈరోజు న్యాయస్థానం వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు అతనికి లేఖ రాయడంలో సాయం చేసిన ఇద్దరిని పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా విచారిస్తున్నారు. గత గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ ను సెల్ఫీ పేరుతో సమీపించిన శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో మెడపై పోటు వేసేందుకు యత్నించాడు.

More Telugu News