Andhra Pradesh: కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై బీజేపీ జెండా, ఇంటిలో వైసీపీ జెండా ఎగురుతున్నాయి!: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

  • రాత్రికిరాత్రి కన్నా బీజేపీలో చేరిపోతారు
  • మంత్రిగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని అడ్డుకున్నారు
  • ఆయన అవినీతిపై రెండ్రోజులు అసెంబ్లీ దద్దరిల్లింది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం రోజుకో కబ్జా, పూటకో దందాగా సాగుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేలా సాయం చేయాలని బ్రతిమాలుకున్న కన్నా.. ఇప్పుడు చంద్రబాబు, ఆయన వెనుకున్నవారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సిమెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన కన్నా..ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో తెలపాలని డిమాండ్ చేశారు. కన్నా ఇంటిపై బీజేపీ జెండా, ఇంటిలోపల వైసీపీ జెండా ఎగురుతుందని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరోజు కన్నా రాత్రికిరాత్రి బీజేపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరతారని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అసలు అగ్రిగోల్డ్ కంపెనీ భ్రష్టుపట్టి పోవడానికి కన్నానే కారణమని విమర్శించారు. కన్నా కుమారుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని కుమారుడు ఒకే కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని వెంకన్న చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించని కన్నా.. ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

1993లో కన్నా అవినీతిపై అసెంబ్లీ రెండు రోజుల పాటు దద్దరిల్లిందనీ, దాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని పేర్కొన్నారు. టీడీపీ కేవలం ప్రేమకే లొంగుతుందనీ, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు.

More Telugu News