రాహుల్ గాంధీ స్వయంగా నాకు ఫోన్ చేశారు.. కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగారు!: బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య

28-10-2018 Sun 12:01
  • బీసీల డిమాండ్లను రాహుల్ ముందుపెడతా
  • ఆ తర్వాతే కాంగ్రెస్ లో చేరికపై నిర్ణయం
  • బీసీలకు 65 శాతం సీట్లు ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా తనకు ఫోన్ చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయన ఆహ్వానించారని వెల్లడించారు. బీసీలకు రిజర్వేషన్ సహా ఇతర కీలక డిమాండ్లను రాహుల్ ముందు ఉంచుతాననీ, ఆయన ప్రతిస్పందనను బట్టి కాంగ్రెస్ లో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

2019లో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీసీల కోసం సొంతపార్టీని ఏర్పాటు చేస్తామని ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. బీసీల కోసం రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని చాలామంది మిత్రులు కోరుతున్నట్లు తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ నేతలు ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 65 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు.