Telangana: బతుకమ్మ చీరల రహస్య తరలింపు.. భారీగా స్వాధీనం చేసుకున్న పోలీసులు!

  • చౌటుప్పల్ నుంచి లారీలో రహస్యంగా తరలింపు
  • కొత్తగూడెం కు చేరవేసేందుకు యత్నం
  • ఆందోళనకు దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరలతో వెళుతున్న లారీని పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. లారీ నిండుగా ఉన్న చీరలను ఈ సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై లారీ డ్రైవర్ మాట్లాడుతూ .. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ లో చీరలను లోడ్ చేసినట్లు తెలిపాడు. వీటిని కొత్తగూడెం పట్టణానికి తరలిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకు మించి తనకేమీ తెలియదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో లారీలోని చీరలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున చీరల పంపిణీని నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రభుత్వ అధికారులు నిలిపివేశారు. మరోవైపు బతుకమ్మ చీరలను తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీల నేతలు లారీ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News