YSRCP: వైఎస్ జగన్ పై దాడి కేసు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలివే!

  • మధ్యాహ్నం జగన్ ఎయిర్ పోర్టులోకి వచ్చారు
  • అంతలోనే దాడి జరిగిపోయింది
  • రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఈ రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్న అతడిని వచ్చే నెల 2వ తేదీ వరకూ జ్యుడీషియల్ కస్టడీకీ అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను రాసిన 10 పేజీల లేఖ ఆధారంగా విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై దాడి వ్యవహారానికి సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది.

గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖపట్నంలోని ఎయిర్ పోర్టుకు చేరుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 8 నిమిషాల పాటు జగన్ అక్కడే ఉన్నారని వెల్లడించారు. దీంతో ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు జగన్ పై కోడి పందేలకు వాడే కత్తితో దాడి చేశాడని పేర్కొన్నారు. యూనిఫాంలో ఉండటంతో నేతలెవరూ అతనిని సరిగ్గా గమనించలేదన్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష నేతకు 2 నుంచి 3 అంగుళాల లోతు గాయం అయిందని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

దాడి సందర్భంగా శ్రీనివాసరావు తలకు బలమైన గాయమయిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ నివేదికలో రమాదేవి అనే మహిళ పేరును కూడా అధికారులు ప్రస్తావించారు. అయితే రమాదేవి ఎవరన్న విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం వైజాగ్ జైలులో ఉన్న శ్రీనివాసరావును తమ కస్టడీకి తీసుకునేందుకు సిట్ అధికారులు, పోలీస్ అధికారులు వైజాగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.

More Telugu News