events now: రేవంత్‌రెడ్డిపై ఈవెంట్స్‌ నౌ సంస్థ ఆగ్రహం...రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరిక!

  • ఈ-కామర్స్‌పై ఆయనకు కనీస అవగాహన లేదని అర్థమైంది
  • మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించం
  • ఇప్పటి వరకు స్వయంగా ఒక్క ఈవెంట్ నిర్వహించలేదని స్పష్టీకరణ

  తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై ఈ-కామర్స్‌ కంపెనీ ‘ఈవెంట్స్‌ నౌ’ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన ఆరోపణలు చూస్తుంటే ఈ-కామర్స్‌ కంపెనీపై ఆయనకు అవగాహన లేదని తేలిపోయిందన్నారు. తమ కంపెనీపై రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోకుంటే ఆయనపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయన్నన్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

సెన్సేషన్‌ కార్యక్రమానికి, ఈవెంట్స్‌ నౌకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ‘కార్యక్రమాలకు టికెటింగ్‌ చేయడం వేరు. కార్యక్రమాలు స్వయంగా నిర్వహించడం వేరు. రెండూ పూర్తి భిన్నమైన వ్యాపారాలు. ఆపాటి కనీస అవగాహన రేవంత్‌ రెడ్డికి లేదని ఆయన ఆరోపణలు చూస్తే అర్థమైంది’ అని కంపెనీ పేర్కొంది.

దేశంలో ఉన్న వందలాది టికెటింగ్‌ కంపెనీల్లో అగ్రగామి ఈవెంట్స్‌ నౌ అని, బుక్‌ మై షో, పేటీఎం మాదిరే తమ కంపెనీ కూడా పనిచేస్తుందని తెలిపింది. రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కేవలం మంత్రి కేటీఆర్‌ బావమరిది సంస్థ అన్న కోపంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది.

గతంలోనూ రేవంత్‌ ఇలా అవాకులు, చవాకులు మాట్లాడితే లీగల్‌ నోటీసు ఇచ్చామని, సమాధానం ఇవ్వలేక రేవంత్‌ తోకముడిచారని గుర్తు చేసింది. సంస్థ వ్యవస్థాపకులు రాజ్‌ పాకాల అమెరికాలో ఉన్నత చదువు చదివి సాప్ట్‌వేర్‌ కంపెనీలు నడుపుతున్న వ్యక్తి అని, కేవలం కేటీఆర్‌ బంధువన్న కోపంతో తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రేవంత్‌ రెడ్డి ఆరోపణలపై వంద కోట్లకు దావావేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

More Telugu News