Andhra Pradesh: టార్గెట్ టీడీపీ.. ఢిల్లీకి బయలుదేరిన వైసీపీ నేతలు.. మరికాసేపట్లో హోంమంత్రి రాజ్ నాథ్ తో భేటీ!

  • శాంతిభద్రతలపై ఫిర్యాదుకు నిర్ణయం
  • థర్డ్ పార్టీ విచారణ కోరే ఛాన్స్
  • మేకపాటి నేతృత్వంలో బయలుదేరిన నేతలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. కేంద్రం వ్యవహారశైలిని దుయ్యబడుతూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవహారశైలిని ఎండగట్టేందుకు వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు.

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో బొత్స సత్యనారాయణ, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు నేతలు మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ విషయమై వైసీపీ నేత ఒకరు స్పందిస్తూ.. ఈ రోజు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ బృందం భేటీ కానున్నట్లు తెలిపారు.

వైఎస్ జగన్ పై దాడి జరిగిన తీరు, అనంతర పరిణామాలను ఆయనకు వైసీసీ నేతలు వివరించనున్నారు. ఈ సందర్భంగా జగన్ పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీతో నిష్పాక్షిక విచారణ జరపాల్సిందిగా కోరతామన్నారు. ఢిల్లీ టూర్ లో భాగంగా రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ నేతలు కలుసుకుంటారని తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. జగన్ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

More Telugu News