Revanth Reddy: ఒక్కో టికెట్ రూ.5 లక్షలా?.. గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు ఏం జరగబోతోంది!: 'సెన్సేషన్ రైజ్' కార్యక్రమంపై రేవంత్ రెడ్డి

  • లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు
  • పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలి
  • నిప్పులు చెరిగిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బార్లు, పబ్బులకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది పాకాల రాజ్ కు చాలా బార్లు, పబ్బులు ఉన్నాయని ఆరోపించారు.

హైదరాబాద్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యసనాలకు అడ్డాగా సీఎం కేసీఆర్ మార్చేశారని రేవంత్ దుయ్యబట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేషన్ రైజ్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ రోజు సాయంత్రం జరిగే సెన్సేషన్ రైజ్ ఈవెంట్ ఒక్కో టికెట్ ను రూ.5 లక్షలకు అమ్ముతున్నారని ఆరోపించారు. అసలు లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలకు, వాటి డీలర్లను ఏర్పాటు చేసుకోవడానికే ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎందుకు అటకెక్కించారని రేవంత్ ప్రశ్నించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కట్టకుండా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ ఈవెంట్‌పై తెలంగాణ ఎన్నికల అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ బంధువులకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని, ముఖ్యమంత్రి బంధువులు బ్రోకర్ అవతారమెత్తారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సెన్సేషన్ రైజ్ ఈవెంట్ లో పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు.

More Telugu News