kidari-soma murder: దోపిడీ చర్యలు ఆపాలని హెచ్చరించినా వినలేదు...అందుకే కిడారి, సోమ హత్య: మావోయిస్టుల లేఖ

  • ఏఓబీ ప్రతినిధి జగబందు పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
  • లేటరేట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలు నిర్వహిస్తున్న కిడారి
  • మావోయిస్టు డిప్యుటీ కమాండర్‌ మీనాను పట్టుకుని కాల్చిచంపారు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యపై మావోయిస్టులు ఎట్టకేలకు స్పందించారు. ఏజెన్సీలో ఇద్దరు నేతలు పాల్పడుతున్న దోపిడీ కార్యకలాపాలను ఆపాలని పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడం వల్లే కాల్చిచంపామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏవోబీ ప్రతినిధి జగబందు పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

‘ఏజెన్సీలో లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలు కిడారి నిర్వహిస్తున్నారు. వాటిని నిలిపివేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటే వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ అణచివేతకు ప్రతీకారంగానే కిడారి, సోమలపై చర్యలు తీసుకున్నాం’ అని జగబందు ఆ లేఖలో పేర్కొన్నారు. కిడారి, సోమలను కాల్చి చంపిన తర్వాత మన్యంలో గిరిజనులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, యువకులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి జైలుకు పంపుతున్నారని జగబందు విమర్శించారు.

రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుష్టపాలన సాగుతోందని, నాలుగేళ్లు మోదీతో చేతులు కలిపిన బాబు, రాష్ట్రంలో దోపిడీ పాలన సాగించారని ఆరోపించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడిన వారిని అక్రమ అరెస్టులు చేయించారని, ఎంతోమందిని లొంగదీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇక, ఏవోబీలో పెదబయలు డిప్యూటీ కమాండర్‌ మీనాను ప్రజల ముందే కాల్చిచంపి పోలీసులు ఎన్‌కౌంటర్‌ కట్టుకథ అల్లారని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 12న చిత్రకొండ బ్లాక్‌లోని ఆండ్రపల్లిలో మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనంతరం ప్రజల ముందే కాల్చిచంపారని జగబందు పేర్కొన్నారు. మేధావులు, పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి మీనా మృతిపై నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News