raghuveera reddy: రఘువీరారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం
  • ఐటీ శాఖ కార్యాలయం వైపుగా నిరసన ప్రదర్శన
  • అరెస్ట్ చేసి, భవానీపురం పీఎస్ కు తరలించిన పోలీసులు

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఫెల్ కుంభకోణంపై ఏఐసీసీ పిలుపు మేరకు విజయవాడలో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులో ఉన్న ఐటీ శాఖ కార్యాలయం వైపుగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రరత్న భవనం వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదంటూ అక్కడే ఆపేశారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, రఘువీరా సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, భవానీపురం పీఎస్ కు తరలించారు.

ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, రాఫెల్ యుద్ధ విమానాల‌ కుంభ‌కోణంలో ప్రధాని న‌రేంద్ర‌మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇద్దరూ దోపిడిదారులు, దొంగ‌ల‌ని విమర్శించారు. రాఫెల్ కుంభ‌కోణంపై జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటీ వేయాల‌ని, లేదా మోదీ రాజీనామా చేయాల‌నే డిమాండ్ దేశ వ్యాప్తంగా పెరుగుతుంటే... విచార‌ణ చేయ‌కుండా.... అర్ధ‌రాత్రి 2.00 గంట‌ల‌కు సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్‌వ‌ర్మను ఉన్నప‌ళంగా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించి, మ‌రొక‌రిని నియ‌మించ‌డంలో అర్థం ఏమిటని  ప్ర‌శ్నించారు.   

More Telugu News