Jagan: జగన్ పై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. ఏపీ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన ప్రతిపక్ష నేత!

  • ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని స్పష్టీకరణ
  • తెలంగాణ పోలీసులైతే అభ్యంతరం లేదని వెల్లడి
  • అమరావతికి వెనుదిరిగిన సిట్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో ఓ యువకుడు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన జగన్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే విడుదల అయ్యేముందు జగన్ ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) వాంగ్మూలం ఇచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆంధ్రా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు విచారణకు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఏపీ పోలీసులకు మాత్రం తాను వాంగ్మూలం ఇవ్వబోనని కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సిట్ అధికారులు మౌనంగా అమరావతికి వెనుదిరిగారు.  

More Telugu News