Andhra Pradesh: సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ జగన్!

  • నిన్న వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి
  • ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు రాక
  • సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన ప్రతిపక్ష నేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై దాడి చేశాడు. కోడిపందేల సందర్భంగా వాడే చురకత్తితో జగన్ పై దాడికి పాల్పడటంతో ఆయన చొక్కా రక్తసిక్తమయింది. దీంతో విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న జగన్ హైదరాబాద్ కు బయలుదేరారు. అనంతరం ఇక్కడి సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు.

ఈ నేపథ్యంలో జగన్ కు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు 9 కుట్లు వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రతిపక్ష నేత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. జగన్ డిశ్చార్జ్ వార్త తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. కాగా, జగన్ కు ఐదు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

More Telugu News