YSRCP: ఆంధ్రా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జగన్ కు రక్షణ లేదు.. అందుకే హైదరాబాద్ కు తరలించాం!: వైవీ సుబ్బారెడ్డి

  • హత్యాయత్నంపై చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు
  • ఏపీలో వ్యవస్థలపై మాకు నమ్మకం లేదు
  • పోలీసుల సమక్షంలోనే ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉందని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.2003 లో అలిపిరి దాడి ఘటనపై దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవర్తనకు, తాజాగా వైఎస్ జగన్ పై దాడి వ్యవహారంలో చంద్రబాబు ప్రవర్తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో జగన్ చికిత్స పొందుతున్న న్యూరో సిటీ ఆసుపత్రి వద్ద సుబ్బా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైజాగ్ లో ప్రాథమిక చికిత్స తీసుకున్నాక కూడా జగన్ పై దాడిని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కత్తితో దాడి తర్వాత జగన్ చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయిందని సుబ్బారెడ్డి తెలిపారు. వెంటనే ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం జగన్ హైదరాబాద్ కు బయలుదేరారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై తమకు ఎంతమాత్రం నమ్మకం లేదని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు.

ఏకంగా ఎయిర్ పోర్టులోనే దాడి జరగడంతో ప్రభుత్వాసుపత్రుల్లో కూడా జగన్ ప్రాణానికి రక్షణ లేదని భావించే హైదరాబాద్ కు వచ్చామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనపై విచారణ జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరతామని స్పష్టం చేశారు. జగన్ పై దాడి ఘటనను కవర్ చేయడానికి యత్నించిన వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామన్నారు.

More Telugu News