baby kidnap: మూడు నెలల చిన్నారి అపహరణ...కొన్ని గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

  • తెలిసిన మహిళే ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా ఆధారం
  • తీగలాగితే కదిలిన కిడ్నాప్‌ డొంక
  • బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

తెలిసిన మహిళ మోసం ఓ తల్లి గుండె కోతకు కారణమైంది. ఆమె మూడు నెలల బిడ్డను అపహరించడంతో ఆ తల్లి కొన్ని గంటలపాటు తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. పోలీసులు సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా తెలిసిన మహిళపైనే బాధితులు అనుమానం వ్యక్తం చేయడంతో వారు కూపీ లాగారు. దీంతో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభించి కథ సుఖాంతమైంది.

పోలీసుల కథనం మేరకు...మాంసం వ్యాపారి అయిన మహ్మద్‌ ఆసిఫ్‌ ఖురేసీ, మొహసినా బేగం దంపతులు బండ్లగూడ సమీపంలోని సూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బుధవారం చిన్నకూతురు ఫాతిమాకు ప్రమాదం జరిగి గాయం కావడంతో మొహసినా ఆమెను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది.

ఆ క్రమంలో తన మూడు నెలల బాబు మహ్మద్‌ హాజిని, ఏడేళ్ల పెద్ద కొడుకు మహ్మద్‌ షోయబ్‌కు అప్పగించింది. తమ్ముడిని ఒడిలో పెట్టుకుని షోయబ్‌ బయట ఆడిస్తుండగా, బురఖాతో ఓ మహిళ వచ్చి మీ అమ్మ రమ్మంటోందంటూ చెప్పింది. తమ్ముడిని పక్కన పడుకోబెట్టి షోయబ్‌ ఆస్పత్రివైపు పరుగు తీయగానే సదరు మహిళ ఆ మూడు నెలల బాబును ఎత్తుకెళ్లింది.

కూతురికి వైద్యం చేయించాక తిరిగి వచ్చిన మొహసినా బేగం తన చిన్న కొడుకు కనిపించక పోవడంతో ఆందోళన చెందింది. భర్తకు విషయం చెప్పడంతో అతను బస్తీవాసులతో కలిసి అన్నిచోట్లా వెతికాడు. బిడ్డ ఆచూకీ లేకపోవడంతో ఆ రాత్రే చాంద్రాయణ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసిఫ్‌ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఇంటిపై ఉన్న సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. అందులో బురఖా వేసుకున్న ఓ మహిళ బిడ్డను ఎత్తుకెళ్లడం కనిపించింది. ఆ మహిళ నడక, బురఖా ఆధారంగా బాధిత తల్లిదండ్రులు తమకు పరిచయం ఉన్న వాజిదా పేరు చెప్పడంతో ఆమెను, అబ్దుల్లా అనే మరో వ్యక్తిని ప్రశ్నించారు.

అలాగే  శివారులోని షాహిన్‌నగర్‌, బండ్లగూడ సమీపంలోని గౌస్‌నగర్‌ ప్రాంతాల్లో మరికొందరిని విచారించారు. ఈ విచారణలో చిన్నారి హాజిని హన్మకొండకు చెందిన ఫౌజియా దంపతులు ఎత్తుకెళ్లినట్లు తేలింది. పాతబస్తీ సూరీనగర్‌ ప్రాంతానికి చెందిన ఫౌజియా, వాజిదాకు వరుసకు సోదరి. పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం లేకపోవడంతో పెంచుకునేందుకు బిడ్డను చూడాలని హన్మకొండకు చెందిన అబేదా బేగంను కోరింది.

ఆమె వాజిదాను సంప్రదించడంతో ఈ కిడ్నాప్‌కు పాల్పడిందని పోలీసులు తేల్చారు. విషయం చెప్పడంతో ఫౌజియా దంపతులు అర్ధరాత్రి దాటాక పాతబస్తీకి వచ్చి వాజిదాకు రూ.20 వేలు ఇచ్చి బిడ్డను తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు వాజిదాతోపాటు కిడ్నాప్‌ వ్యవహారంలో పాత్ర ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ వెళ్లి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.

More Telugu News