Sabarimala: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్టు చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్ల ఫిదా

  • తనకు పూజించే హక్కు ఉందన్న స్మృతి
  • మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల గరం
  • ఫొటోతో అందరి నోళ్లూ కట్టిపడేసిన మంత్రి

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఆ ఫొటోకు వేల లైకులు వచ్చాయి. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇటీవల మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడడం సరికాదని, తాను ఓ మంత్రినని, కానీ తన అభిప్రాయం ప్రకారం తనకు పూజించే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే, అలాంటి ప్రదేశాన్ని అపవిత్రం చేసే హక్కు మాత్రం ఉండదని, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను గుర్తించి గౌరవించాల్సిందేనని అన్నారు. అది మన విజ్ఞతకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.

మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన స్మృతి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేశారు. కుర్చీలో కూర్చున్న ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోరు కూడా మూసేశారు. గతంలో ఆమె నటించిన ‘క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ’ అనే సీరియల్‌లోనిది ఈ ఫొటో. దీనికింద ఆమె తానేదైనా మాట్లాడితే ఎప్పుడూ వాగుతూనే ఉంటానని అంటారని క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అవుతున్నారు. ఒక్క ఫొటోతో తానేం చెప్పాలనుకున్నారో దానిని స్పష్టంగా చెప్పారని ప్రశంసిస్తున్నారు.

More Telugu News