Cricket: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విండీస్ ఆల్ రౌండర్

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో
  • యువతరానికి అవకాశమివ్వాలనే నిర్ణయం
  • టీ20 ఫ్రాంఛైజీల్లో ఆడతానని స్పష్టీకరణ

తనదైన రోజున బ్యాట్ తోపాటు బంతితో కూడా రాణించి మ్యాచ్ స్థితిని మార్చేయగల ఆటగాడు... అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రతిభావంతుడు.. ఐపీఎల్ ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయాన్ని వెలువరించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీల్లో కొనసాగుతానని వెల్లడించాడు. విండీస్ కెప్టెన్ గా 2014లో బ్రావో చివరి వన్డే ఆడాడు.
 
2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన బ్రావో మొత్తం 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. టెస్టు ఫార్మాట్ లో 2200 పరుగులు చేసిన బ్రావో 3 సెంచరీలు, 13 అర్థ సెంచరీలతోపాటు 86 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 2968 పరుగులు చేయడమే కాకుండా 86 వికెట్లను పడగొట్టాడు. టీ20 ఫార్మాట్ లో 1142 పరుగులు, 52 వికెట్లు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్ అవుతున్నానని, 14 ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ పై తొలి మ్యాచ్ ఆడానని, ఆ క్షణాలు గుర్తున్నాయని బ్రావో గుర్తుచేసుకున్నాడు. తొలి మ్యాచ్ కు ముందు మెరూన్ క్యాప్ అందుకున్నప్పుడు కలిగిన ఉత్సాహం, అనుభూతి ఇన్నాళ్ల తన క్రికెట్ జీవితంలో తోడుగా ఉన్నాయని పేర్కొన్నాడు. క్రికెట్ లో సుదీర్ఘకాలం కొనసాగానని, యువతరానికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నానని వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబం, తోటి ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలియజేశాడు.

More Telugu News