Andhra Pradesh: మోగిన ఉద్యోగ జేగంట... ఏపీలో వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు... డీఎస్సీ షెడ్యూల్ ఇదే!

  • షెడ్యూల్ విడుదల చేసిన గంటా శ్రీనివాసరావు
  • నవంబర్ 1 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు
  • డిసెంబర్ 6 నుంచి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ ను స్వయంగా ప్రకటించారు. పలు సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్పిన ఆయన, నవంబర్ 1 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు అందుబాటులోకి తేనున్నామని అన్నారు. దరఖాస్తులు 16వ తేదీ వరకూ పొందవచ్చన్నారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజస్)కు డిసెంబర్ 6 నుంచి 10 వరకు, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్)కు డిసెంబర్ 11న పరీక్ష ఉంటుందని తెలిపారు. 12, 13 తేదీల్లో పీజీ టీచర్స్ రాతపరీక్ష ఉంటుందని అన్నారు.

టెట్ కట్ టీఆర్టీ ద్వారా 7,675 ఉద్యోగాలను, ప్రభుత్వ, జెడ్పీ పోస్టులు 4,341, మునిసిపల్ పోస్టులు 1,100, మోడల్ స్కూల్స్ లో 909 పోస్టులు, బీసీ వెల్ఫేర్ లో 300 పోస్టులు, ఎస్జీటీ 3,666 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1,625 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్ 452 పోస్టులు భర్తీ చేయనున్నామని గంటా వెల్లడించారు. నవంబర్ 19 నుంచి సెంటర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. నవంబర్ 17 నుంచి ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తామని, 20 తరువాత హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. 

More Telugu News