China: భారత గగనతలంలో.. పది నిమిషాలపాటు చక్కర్లు కొట్టిన చైనా హెలికాప్టర్లు

  • గత నెల 27న ఘటన
  • లడఖ్‌లో చక్కర్లు కొట్టిన రెండు హెలికాప్టర్లు
  • ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు

భారత గగనతలాన్ని శత్రుదేశాలు తరచూ ఉల్లంఘించడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. గమనించిన భారత వైమానిక దళం కాల్పులు జరపడంతో అది తోకముడిచింది. తాజాగా, చైనాకు చెందిన రెండు హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా ఏకంగా పది నిమిషాలు చక్కర్లు కొట్టిన విషయం బయటపడి కలకలం రేపుతోంది.

 సెప్టెంబరు 27న లడఖ్‌లోని ట్రిగ్ హైట్స్ వద్ద చైనా హెలికాప్టర్లు కనిపించాయి. ఏకంగా పదినిమిషాల పాటు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన అనంతరం వెనుదిరిగాయి. ఇప్పుడీ విషయం బయటపడి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత గగనతలాన్ని శత్రుదేశాలు పదేపదే ఉల్లంఘిస్తున్నా భారత్ ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గగనతల అతిక్రమణలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News