Chandrababu: ‘రాఫెల్’పై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్ ను తప్పించారు: సీఎం చంద్రబాబు

  • మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించింది
  • సీబీఐ డైరెక్టర్ గా నియమిస్తే రెండేళ్లు కొనసాగించాలి
  • వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సీబీఐ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ పరిపాలన ఎలా ఉందంటే సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో ఉందని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని, రాఫెల్ కుంభకోణంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్ ను అనధికారికంగా తప్పించారని ఆరోపించారు. ప్రధాని మోదీ వద్ద పని చేసే ఆస్థానాను కాపాడేందుకు సీబీఐ డైరెక్టర్ ని మార్చే పరిస్థితికి వచ్చారని మండిపడ్దారు. సీబీఐ డైరెక్టర్ గా ఎవరినైనా నియమిస్తే రెండేళ్ల వరకు కొనసాగించాలని, ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు కల్పించుకోకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే.. ఈ ముగ్గురు కలిసి సీబీఐ డైరెక్టర్ ని నియమిస్తారని.. ఏదైనా సమస్య ఉంటే ఆ ముగ్గురు మాత్రమే పరిష్కరిస్తారన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని అన్నారు.  

ఆస్థానాను, ఆయన అవినీతిని, రాఫెల్ కుంభకోణంలో చిక్కుకుపోయిన మోదీ తన అవినీతిని కాపాడుకునేందుకే సీబీఐ డైరెక్టర్ ను తీసేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ ని తొలగించే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కి కూడా లేదని అన్నారు. రాఫెల్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో దీనిపై కూడా సీబీఐ విచారణ చేస్తుందనన్న భయంతో ఆ సంస్థ డైరెక్టర్ ని తీసేసే పరిస్థితికొచ్చారని, ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏపీలో ఐటీ దాడుల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తులపై ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, వైసీపీ, జనసేన భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని కాల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News