Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాల్సిందే: బీజేపీ నేత లక్ష్మణ్ సెటైర్లు

  • కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ మునిగిపోయిన పడవలే
  • కేవలం నాలుగు సీట్ల కోసమే మహాకూటమి ఏర్పడింది
  • బీజేపీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని  టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోక తప్పదని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ మునిగిపోయిన పడవలేనని వ్యాఖ్యానించారు.

మహాకూటమికి ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని, కేవలం నాలుగు సీట్లు సంపాదించడం కోసమే ఈ కూటమి ఏర్పడిందని విమర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీజేఎస్ అధినేత కోదండరామ్ ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్వహించే బహిరంగ సభలు నాల్గింటిలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద గురించి ఆయన ప్రస్తావిస్తూ, టీ-బీజేపీలో పరిపూర్ణానంద కీలక బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పారు.

More Telugu News