Telangana: టీఆర్ఎస్ నేతలకు నిరసనల సెగ.. కరీంనగర్, సూర్యాపేటలో అడ్డుకున్న ప్రజలు!

  • గాదరి కిశోర్ కుమార్ ను అడ్డుకున్న యువకులు
  • గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న
  • వొడితెల సతీశ్ కుమార్ కు చేదు అనుభవం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అక్కడక్కడా నిరసనల సెగ తగులుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెబుతూ కొన్ని చోట్ల ప్రజలు వారిని అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో నిన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన్ను స్థానిక యువకులు అడ్డుకున్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తాము టీఆర్ఎస్ కు ఓటు వేయబోమని వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ.. కిశోర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం నవాబుపేటలో టీఆర్ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ యాత్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ తాగునీటి సమస్యను తీర్చని సతీశ్ కు ఎందుకు ఓటేయాలని నిలదీశారు.

More Telugu News