Telangana: తెలంగాణలో మహాకూటమి పొత్తు కుదిరింది... పోటీ చేయబోయే సీట్ల సంఖ్య వివరాలు!

  • పట్టువిడుపులు ప్రదర్శించిన పార్టీలు
  • రంగంలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు
  • 90 సీట్లలో పోటీ పడనున్న కాంగ్రెస్
  • టీడీపీ 15, టీజేఎస్ 10, సీపీఐ 4 స్థానాల్లో పోటీ!

తెలంగాణలో మహాకూటమిలో పొత్తు కుదిరిందని తెలుస్తోంది. అన్ని పార్టీలూ పట్టువిడుపులను ప్రదర్శించడం, ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి, నెగ్గాలంటే తగ్గాలన్న సూత్రాన్ని పాటించడంతో సమస్య సద్దుమణిగింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో పోటీ చేయనుంది. మిత్రపక్షాల్లో టీడీపీకి 15, టీజేఎస్ కు 10, సీపీఐకి 4 స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, అందుకు మిగతా పార్టీలు కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది.

సీట్ల సంఖ్యపై నేడో, రేపో, అధికారిక ప్రకటనను వెలువరించనున్న మహాకూటమి నేతలు, ఆపై తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సంకేతాలను వెలువరుస్తూ అభ్యర్థుల పేర్లను ఉమ్మడిగా ప్రకటిస్తారని సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న లోక్ సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మహాకూటమి నేతలు అంటున్నారు. వివిధ సర్వేల ఆధారంగా, ప్రతి సీటు నుంచి బలమైన అభ్యర్థినే ఎంపిక చేయాలని అన్ని పార్టీలూ ఓ నిర్ణయానికి వచ్చాయి.

మహాకూటమి తొలి జాబితాలో 60 మంది పేర్లు వెల్లడికావచ్చని సమాచారం. కాంగ్రెస్ తరఫున 40 నుంచి 50 మంది పేర్లు, టీడీపీ నుంచి 8, టీజేఎస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తూ, మొత్తం జాబితాలో 35 బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉండేలా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ భావిస్తోంది.

More Telugu News