kcr: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: ఉత్తమ్ డిమాండ్

  • ఇన్నేళ్లూ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు?
  • ఈవిధంగా నిర్లక్ష్యం చేసిన వీళ్లకు ఒకటే శిక్ష విధించాలి
  • వీళ్లను బొంద పెట్టాలి.. గోరీ కట్టాలి

నాలుగున్నరేళ్లలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు గానీ, మళ్లీ ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తే ఈ పథకాలను అమలు చేస్తానని హామీ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు ఓట్లు వేయరని, కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమవడం, కేటీఆర్ అమెరికాకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఎన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉందంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది సన్నాసులా?దద్దమ్మలా? ఏమనాలి? అనే విషయాన్ని తెలంగాణ యువత నిర్ణయించుకోవాలని అన్నారు.  

ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన వీళ్లకు ఒకటే శిక్ష విధించాలని, ‘బొంద పెట్టాలి.. గోరీ కట్టాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు కల్పించేందుకు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇచ్చేందుకు సమయం ఉండదు కానీ, వారు విలాసాలు అనుభవిస్తారని కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు.

More Telugu News