Telangana: పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి 30 సార్లు ఉత్తరాలు రాశారు!: కేటీఆర్

  • మహాకూటమి వస్తే జుట్టు చంద్రబాబు చేతిలోకి
  • తెలంగాణ మళ్లీ అన్యాయమై పోతుంది
  • కాలుష్యం లేకుండా ఫార్మా సిటీ నిర్మాణం

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ పార్టీలు కలిసి ఏర్పడ్డ మహాకూటమని రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో దున్నేస్తాం, మట్టి కరిపించేస్తాం, అదరగొట్టేస్తాం అంటూ మహాకూటమి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఏ పార్టీ కారణంగా తమకు లబ్ధి చేకూరిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనీ, వారంతా టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రంగారెడ్డి జిల్లాలో 85,000 ఎకరాలకు సాగునీరు అందించాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను తీసుకురావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ నీటి ద్వారా డిండి ప్రాజెక్టును నింపి, అక్కడి నుంచి శివన్నగూడెం ద్వారా ఓ 5 టీఎంసీల నీటిని తీసుకొస్తే పంటలకు నీరు ఇవ్వొచ్చన్నారు. ఇందుకోసం రూ.2,200 కోట్లు ఖర్చు అవుతుందనీ, ఇందుకోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే చంద్రబాబు మాత్రం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమమనీ, దాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి, జలవనరుల సంఘానికి ఇప్పటివరకూ 30 ఉత్తరాలు రాశారని పేర్కొన్నారు.

ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వస్తే జుట్టు చంద్రబాబు చేతుల్లోకి పోతుందని, ఇబ్రహీంపట్నం ప్రాంతం ఎడారిగా మారిపోతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరగడంతోనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని కేటీఆర్ అన్నారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులు మట్టికొట్టుకుపోతారని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేసే ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు.

పటాన్ చెరు, జీడిమెట్లలో కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లు ఫార్మా సిటీ నిర్మాణం చేపడితే ఒప్పుకోనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశుభత్రకు ప్రాధాన్యత ఇస్తూ ఫార్మా సిటీని నిర్మిస్తున్నామని కేటీర్ అన్నారు. దీని కారణంగా వేల సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే రైతులకు శిక్షణ ఇచ్చి ఇదే కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.

More Telugu News