Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం!

  • ప్రత్యేకాధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు
  • ప్రభుత్వం జారీచేసిన జీవో 90 కొట్టివేత
  • ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఈసీకి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఈ రోజు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లోగా  అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగించడాన్ని సవాలు చేస్తూ కొంతమంది మాజీ సర్పంచులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అధికారుల ద్వారా పాలన నిర్వహించడం అన్నది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. వెంటనే ఈ జీవోను కొట్టివేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 90ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

వచ్చే 3 నెలల్లోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రత్యేకాధికారుల ద్వారా పూర్తి చేయాలని సూచించింది. ఇటీవల తెలంగాణలో సైతం ప్రత్యేకాధికారుల నియామకాలను రద్దు చేసిన హైకోర్టు.. 3 నెలల్లోగా ఎన్నికలు చేపట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News