Andhra Pradesh: తొలిసారి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మేమే తెచ్చాం.. దేశమంతా అమలు చేస్తే అద్భుత ఫలితాలు!: మంత్రి నారా లోకేశ్

  • అమరావతి భూ రికార్డుల నిర్వహణలో వాడుతున్నాం
  • 2022 నాటికి టాప్-3 రాష్ట్రంగా నిలుస్తాం
  • భవిష్యత్ టెక్నాలజీపై బ్యాంకులు దృష్టి పెట్టాయి

2022 నాటికి ప్రజల తలసరి ఆదాయంలో దేశంలోనే మూడో స్థానంలో నిలవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2029 నాటికి తలసరి ఆదాయంతో పాటు ఆనంద సూచీలోనూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఈ రకమైన గొప్ప విజన్ తో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు. ప్రతిఏటా 15 శాతం ఆర్థిక  వృద్ధితో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ రోజు వైజాగ్ లోని నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న ఫిన్ టెక్ 2.0 సదస్సులో పలు ఐటీ కంపెనీల అధినేతలు, సీఈవోలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

ఒక్క సొంత కార్ కూడా లేని ఓలా.. దేశంలో అతిపెద్ద కార్ అగ్రిగేటర్ గా ఉందనీ, చిన్న దిండు కూడా లేని ఓయో అతిపెద్ద హోటల్ బుకింగ్ యాప్ గా మారిందని లోకేశ్ కితాబిచ్చారు. తాను భారత్ తో పాటు చాలా దేశాల్లోని బ్యాంకులను సందర్శించాననీ, వాటిలో చాలా సంస్థలు తర్వాతి తరం టెక్నాలజీపై దృష్టి సారించాయని మంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధికి 2016లో ఫిన్ టెక్ ఛాలెంజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అమరావతి భూముల రికార్డుల నిర్వహణకు జేడీ అనే బ్లాక్ చెయిన్ కంపెనీని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, ఈ తరహా టెక్నాలజీ వాడటం దేశంలోనే ఇదే తొలిసారని లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 60 శాతం భూములపై కోర్టుల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సాంకేతికతను వాడితే భారత జీడీపీ 4 శాతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

More Telugu News