Guntur District: భర్తకు మరో మహిళతో, భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు... పొన్నూరు హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలికితీసిన పోలీసులు!

  • కలకలం రేపిన ఆర్టీసీ బస్ డ్రైవర్ సత్యంశెట్టి శ్రీనివాసరావు హత్య
  • శ్రీనివాసరావు భార్యతో పక్కింటి వ్యక్తి వివాహేతర బంధం
  • గొడవ పెట్టుకోవడంతో అవమానంగా భావించిన నరేశ్
  • స్నేహితులతో కలసి హత్య

గుంటూరు జిల్లా పొన్నూరులో తీవ్ర కలకలం రేపిన ఆర్టీసీ బస్ డ్రైవర్ సత్యంశెట్టి శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీని అర్బన్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశామని, భార్యాభర్తల వివాహేతర సంబంధాలే హత్యకు కారణమయ్యాయని బాపట్ల డీఎస్పీ గంగాధరం వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పట్టణంలోని 18వ వార్డులో నివాసం ఉండే శ్రీనివాసరావు విధుల నిమిత్తం నెలలో కొన్ని రోజులు నైట్ డ్యూటీకి వెళుతుంటాడు. అతనికి వట్టి చెరుకూరులోని ఓ మహిళతో సంబంధం మొదలవగా, ఈ విషయంలో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరి మధ్య గొడవలను చూస్తున్న శ్రీనివాసరావు ఇంటి పక్కన ఉండే కారు డ్రైవర్ ఆకుల నరేశ్, ఇదే అదనుగా, శ్రీనివాసరావు భార్య పార్వతికి దగ్గరయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు, తన స్నేహితులను తీసుకెళ్లి నరేశ్ తో గొడవపడ్డాడు. దీన్ని అవమానంగా భావించిన నరేశ్, శ్రీనివాసరావును హత్య చేయాలని ప్లాన్ వేసి, తన ఫ్రెండ్స్ బత్తుల సుబ్రహ్మణ్యం, వలిశెట్టి గోపీలను కలుపుకుని, దసరా నాడు తమ ప్రణాళికను అమలు చేశారు. పండగనాడు తెల్లవారుజామున 4 గంటలకే శ్రీనివాసరావు డ్యూటీ నిమిత్తం బయలుదేరగా, ఆ వీధి చివర్లో ఉన్న వీధిలైట్లను ఆర్పివేసి, మారణాయుధాలతో దాడికి దిగారు. తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించాడు. అదే రోజు ఆకుల నరేశ్ పారిపోగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారించి హత్యకు అతనే కారణమని పోలీసులు అనుమానించారు.

ఆపై అతన్ని, హత్యకు సహకరించిన అతని స్నేహితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కేసును తెలివిగా ఛేదించిన కానిస్టేబుళ్లకు రివార్డులు ఇచ్చినట్టు గంగాధరం తెలిపారు.

More Telugu News