Supreme Court: బాణసంచాను నిషేధించలేము: సుప్రీంకోర్టు రూలింగ్

  • సెంటిమెంట్ తో ముడిపడిన పర్వదినం
  • అమ్మకాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది
  • బాణసంచా తయారీపై ఆధారపడిన 5 వేల కుటుంబాలు

ఇండియాలో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లల సెంటిమెంట్ తో ముడిపడిన దీపావళి, బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించే ఉద్దేశం తమకు లేదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించింది. అయితే, పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా, అమ్మకాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీపావళి నాడు సాధ్యమైనన్ని తక్కువ బాణసంచా కాల్చుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. బాణసంచా తయారీ పరిశ్రమలపై ఆధారపడి దాదాపు 5 వేల కుటుంబాలు బతుకుతున్నాయని, వీరికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపకుండా అమ్మకాలను నిషేధించలేమని పేర్కొంది. ఆన్ లైన్ లో బాణసంచా అమ్మకాలు జరపరాదని కోర్టు ఆదేశించింది.

పలువురు న్యాయవాదులు, ప్రజాసంఘాలు బాణసంచా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం, నేడు తీర్పును వెలువరించింది. గత సంవత్సరం ఢిల్లీలో బాణసంచా నిషేధాన్ని విధించిన సంగతిని ప్రస్తావిస్తూ, కాలుష్య మార్పులను తెలుసుకునేందుకే నాడు ఆ నిర్ణయం తీసుకున్నామని, గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో దీపావళి ముందు, ఆ తరువాత ఢిల్లీలో కాలుష్యంపై పూర్తి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

More Telugu News