Paytm: బాస్‌కే బ్లాక్‌మెయిలింగ్.. రూ.20 కోట్ల డిమాండ్.. ముగ్గురు పేటీఎం ఉద్యోగుల అరెస్ట్

  • కంపెనీ నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించిన ఉద్యోగులు
  • అడిగినంత ఇవ్వకుంటే బయటపెడతామని హెచ్చరిక
  • నిందితుల్లో ఓ మహిళా ఉద్యోగి కూడా

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా రూ.20 కోట్లు గుంజేందుకు ప్రయత్నించిన ముగ్గురు పేటీఎం ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. శర్మ వ్యక్తిగత డేటాను, అత్యంత రహస్యమైన వివరాలను దొంగిలించిన ఉద్యోగులు వాటిని బయటపెడతామని బాస్‌నే బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే తక్షణం రూ.20 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో శర్మ సెక్రటరీ కూడా ఉన్నాడు. ఈ మొత్తం పథకానికి అతడే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. తాము డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకుంటే దొంగిలించిన వివరాలను బయటపెడతామని, వాటిని దుర్వినియోగం చేస్తామని బెదిరించారు. దానివల్ల సంస్థ పరువు పోయి బజారున పడాల్సి వస్తుందని బాస్‌ను హెచ్చరించారు. ఈ కేసులో నాలుగో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

బ్లాక్‌మెయిలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శర్మ.. ఓ మహిళ సహా కొందరు ఉద్యోగులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ నుంచి రహస్య డేటాను దొంగిలించి బెదిరిస్తున్నారని, రూ.20 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతామంటున్నారని పోలీసులకు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ సహా ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News