BJP: బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన ఒప్పందం

  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు
  • జేడీయూకు 16, బీజేపీకి 17 సీట్లు కేటాయింపు
  • ఎన్డీయేలోని ఇతర పార్టీలకు అరకొర సీట్లు

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఎన్డీయేలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ తమ అధికారాన్ని నిలుపుకునే దిశగా పావులు కదుపుతోంది. పొత్తులు, సీట్ల లెక్కలను సరిచేసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలకు, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌కు మధ్య కొన్ని వారాలుగా జరుగుతున్న కోల్డ్‌వార్‌కు తెరపడింది.

ఇరు పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ సీట్లలో 16 సీట్లను జేడీయూకు కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అదే విధంగా ఎన్డీయేలో భాగస్వాములైన రాం విలాస్ పాశ్వాన్‌‌కు చెందిన పార్టీకి 5 సీట్లు, ఉపేంద్ర కుష్వహకు చెందిన పార్టీకి 2 స్థానాలు కేటాయించనున్నారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌కు మధ్య జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఈ వారంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుండగా బీజేపీ అధిష్ఠాన ఒత్తిళ్లను జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అధిగమించారు. సీట్ల కేటాయింపు విషయంలో రాజీపడకుండా తను కోరుకున్న విధంగా సీట్లను పొందగలిగారు. అయితే రాం విలాస్ పాశ్వాన్ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యే అవకాశాలున్నాయని, ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉందని నేతలు భావిస్తున్నారు.

More Telugu News