Telangana: తెలంగాణ మహాకూటమి ముక్కలేనా?... బయటకు రానున్న టీజేఎస్, సీపీఐ!

  • 15 సీట్లు అడుగుతున్న టీజేఎస్, 8 కావాలంటున్న సీపీఐ
  • అన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెబుతున్న కాంగ్రెస్
  • తీవ్ర అసంతృప్తితో ఉన్న కోదండరామ్, చాడ

తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో ఏర్పడిన మహాకూటమి ముక్కలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సమన్వయలోపాల కారణంగా మహాకూటమి నుంచి బయటకు రావాలని టీజేఎస్, సీపీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు కావాలని టీజేఎస్, కనీసం 8 సీట్లు కావాలని సీపీఐ గట్టి పట్టుమీద ఉండగా, టీజేఎస్ కు 5 నుంచి 7, సీపీఐకి మూడు నుంచి నాలుగు సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోదండరామ్, చాడ వెంకటరెడ్డిలు, కూటమి నుంచి బయటకు రావాలని భావించారని తెలుస్తోంది.

తమ డిమాండ్లను ఎన్నో రోజుల ముందుగానే కాంగ్రెస్ ముందుంచినప్పటికీ, స్పష్టత కొరవడిందని సీట్ల పంపకాలు, పొత్తులపై తేల్చకముందే కాంగ్రెస్ నేతలు ప్రచారం మొదలు పెట్టారని కోదండరామ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై పలుమార్లు తాము డెడ్ లైన్ లను పొడిగించుకుంటూ వచ్చామని, ఇక రేపటిలోగా సమస్యను పరిష్కరించకుంటే ఒంటరిపోటీకి తాము సిద్ధమేనని టీజేఎస్ తేల్చి చెబుతున్న పరిస్థితి. సీపీఐ సైతం పొత్తు కుదరకుంటే, తాము 25 స్థానాల్లో పోటీకి సిద్ధమని అంటోంది.

More Telugu News