Telangana: మావోయిస్టు అగ్రనేత గణపతిని పట్టిస్తే రూ.15 లక్షలు.. 258 మంది ఉగ్రవాదులతో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల

  • మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసిన ఎన్ఐఏ
  • గణపతి, బసవరాజ్‌ తలలకు భారీ వెల
  • జాబితాలో 15 మంది పాక్ ఉగ్ర నేతలు

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు తలకు ప్రభుత్వం వెల ప్రకటించింది. ఆయనను పట్టించిన వారికి రూ.15 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. గణపతిని దేశంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా పేర్కొన్న జాతీయ నేర పరిశోధన సంస్థ (ఎన్ఐఏ).. అతడిని పట్టిచ్చిన వారికి రూ.15 లక్షలు ఇస్తామని పేర్కొంది. కరీంనగర్‌ జిల్లాలోని సారంగాపూర్‌కు చెందిన గణపతి 2017లో బీహార్‌లోని గయ ప్రాంతంలో కనిపించినట్టు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక, గణపతి తర్వాతి స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను పట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ ప్రకటించింది. ఎన్ఐఏ ప్రకటించిన 258 మందితో కూడిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో 15 మంది మహిళలు కూడా ఉన్నారు.  

పాకిస్థాన్‌కు చెందిన 15 మంది ఉగ్రవాద నేతలు కూడా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. వీరిలో లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ అగ్రనేత సలాహుద్దీన్, ఉగ్రవాదులు జకీవుర్ రెహ్మాన్, డేవిడ్ హెడ్లీ, జునైద్ అక్రమ్ మాలిక్, సాజిద్ మజిద్ తదితరులు ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వారి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ తెలిపింది.

More Telugu News