cbi: సీబీఐ కర్తవ్య నిర్వహణలో మోదీ సర్కారు తలదూర్చడం వల్లనే పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది: కొలను కొండ శివాజీ

  • సీబీఐని మోదీ జేబు సంస్థగా మార్చేశారు
  • ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే పరస్పరం కేసులు పెట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్లింది
  • సీబీఐపై ప్రధాని కార్యాలయం ఒత్తిడి ఉంది

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా భావించబడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని మోదీ సర్కారు భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. నేరగాళ్లను, అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాల్సిన వారే అవినీతిపరులుగా మారడం మన దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్‌, ప్రత్యేక డైరెక్టర్‌ హోదాలలో ఉన్న వ్యక్తులే పరస్పరం అవినీతి కేసులు పెట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్లిందంటే, ఆ సంస్థ పనితీరు ఏ విధంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సీబీఐ కర్తవ్య నిర్వహణలో మోదీ సర్కారు తలదూర్చడం వల్లనే పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని విమర్శించారు. మోదీ నాలుగున్నరేళ్ల పాలనలో సీబీఐని తమ జేబు సంస్థగా మార్చేశారని దుయ్యబట్టారు.

తన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారినే సీబీఐ ఉన్నత పదవులలో మోదీ నియమించారని శివాజీ మండిపడ్డారు. అవినీతి కేసులలో నిష్పక్షపాత విచారణలు జరపనీయకుండా అధికారులను అడ్డుకుంటున్నారని, తమ రాజకీయ కక్ష సాధింపు కోసం సీబీఐని పావుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. వివిధ కేసులలో తాము చెప్పినట్లు నడుచుకోవాలని సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సీబీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నందునే సీబీఐ అధికారులలో జవాబుదారీ తనం లోపించిందని ఆరోపించారు. అవినీతిపరుల ఆట కట్టించాల్సిన అధికారులు తామే అవినీతి పరులుగా మారి దేశానికి చేటు తెస్తున్నారని అన్నారు. ఒక్క సీబీఐనే కాక, ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను సైతం మోదీ సర్కారు భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

సీబీఐలో నెలకొన్న పరిస్థితిపై దేశం యావత్తు ఆందోళన చెందుతున్నందున... మోదీ సర్కారు వెను వెంటనే దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత విచారణ జరిపించి, అవినీతి అధికారులను పదవుల నుంచి తొలగించాలని శివాజీ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సీబీఐ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేసేందుకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం వెనువెంటనే జాతీయ స్థాయిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపారు. 

More Telugu News